మహిళా జట్టూ పరాజయం బాట

మహిళా జట్టూ పరాజయం బాట

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనకు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన 136 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన అర్ధశతకంతో రాణించినప్పటికీ మిగతా బ్యాట్స్‌విమెన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. నిర్దేశిత 20 ఓవర్లలో కివీస్‌ జట్టు 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. సోఫీ డివైన్‌(62) అర్ధశతకంతో రాణించింది. అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, దీప్తీ శర్మ, పూనమ్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రియా పునియా ఔటయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా రొడ్రిగస్‌తో కలిసి ఓపెనర్‌ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో స్మృతి అర్ధ శతకం నమోదుచేసింది. అయితే 12వ ఓవర్‌లో స్మృతి, 13వ ఓవర్‌లో జెమిమా ఔట్‌ అవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌విమెన్‌ ఎవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు 136 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos