హోసూరు : ఇక్కడి తాలుకాఫీసు ప్రాంగణంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో నలుగురు మహిళా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వారం రోజుల కిందట ఓ మహిళా పోలీసు అధికారిణికి కరోనా పాజిటివ్ వచ్చింది. తదనంతరం పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో ముగ్గురు మహిళా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీసులు కేసుల విషయమై ఎవరెవరిని కలిశారనే కోణంలో వైద్య శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా కరోనా సోకిన మహిళా పోలీసుల కుటుంబాలకు చెందిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.