అమరావతి రాజధాని ప్రాంత వైసీపీ నేతలపై వరసగా ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదంటూ తుళ్లూరు పోలీసులకు రాజధాని ప్రాంత మహిళలు ఫిర్యాదు చేశారు. ఆమె ఎక్కడున్నారో కనిపెట్టాలని తమ ఫిర్యాదులో కోరారు. రాజధాని విషయంలో తాము గత ఆరు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ఆమె ఎందుకు దాక్కుంటున్నారని ప్రశ్నించారు.ఈ సందర్భంగా మీడియాతో మహిళలు మాట్లాడుతూ, అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో జగన్ కూడా చెప్పారని… అందుకే తాము తమ భూములను రాజధానికి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు తామంతా చిన్న బిడ్డలతో కలసి రోడ్డెక్కాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. తమ ఎమ్మెల్యే, ఎంపీ ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని అన్నారు. తమకు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ అంటే ఏమిటో కూడా తెలియదని… అలాంటి తమకు ఇప్పుడు ఇటువంటి నేతల వల్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం తమ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే (ఆళ్ల రామకృష్ణారెడ్డి) కనిపించడం లేదంటూ మంగళగిరి నియోజకవర్గం ప్రజలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..