లండన్ : కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు…ప్రపంచ కప్పు న్యూజిలాండ్ చేతికి చిక్కకపోవడానికి కూడా అన్నే కారణాలున్నాయి. గెలిచి ఓడిన జట్టుగా ఆ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి లభిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆ బాధను దిగమింగుకుంటూ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని, అంతిమంగా మమ్మల్ని ఏదీ విడదీయలేదని తెలిపాడు. ఇంగ్లండ్ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా అని పేర్కొన్నాడు. మరోవైపు ఐసీసీ నియమ నిబంధనల్లో మార్పులు అవసరమని పలువురు మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎక్కువ బౌండరీలు అనే ప్రాతిపదికన విజేతను ప్రకటించిన విషయంపై విలియమ్సన్ ప్రశ్నించగా, ఇలాంటి ప్రశ్నను అడగాల్సి వస్తుందని మీరు కూడా ఊహించి ఉండరనే అనుకుంటున్నానన్నాడు. అలాగే తాను కూడా ఈ విషయంపై సమాధానం చెప్పాల్సి వస్తుందని అనుకోలేదని నవ్వుతూ అన్నాడు. అయితే రెండు జట్లూ సమానంగా పోరాడినప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు.