మూవీస్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి.నాలుగేళ్ల క్రితం ఎన్నో వివాదాలు, ఆరోపణలు,విమర్శలతో రచ్చరచ్చ చేసుకున్న అనంతరం మా అధ్యక్షుడిగా శివాజీరాజా ఎన్నికయ్యాడు.ఈనెల10వ తేదీన ‘మా’కు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి.గత ఎన్నికల్లో శివాజీరాజ ప్యానెల్‌లో ఉన్న సీనియర్ నటుడు నరేశ్ ఈసారి అదే శివాజీరాజాకు పోటీగా బరిలో దిగనున్నారు.కొద్ది రోజుల క్రితం నరేశ్,శివాజీరాజాల మధ్య మనస్పర్ధలు నెలకొన్న నేపథ్యంలో ఇద్దరు పోటీ పడనుండడంతో మాటల యుద్ధాలు గట్టిగానే జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.నరేశ్ ప్యానెల్ నుంచి జీవిత రాజశేఖర్ ప్రధాన కార్యదర్శిగా,రాజశేఖర్ ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తుండగా శివాజీరాజా ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్.. ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు బరిలో ఉన్నారు.మా ఎన్నికల నేపథ్యంలో హీరో రాజశేఖర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం ఉండదని ఓడిపోతే ఎంటనే ప్రశ్నను తనను భయపెడుతుంటుందన్నారు.నరేశ్ సూచన మేరకు మా ఎన్నికల్లో నిల్చోవడానికి నిర్ణయించుకున్నామన్నారు. గతంలో దివంగత నేతలైన వైఎస్సాఆర్,ఎన్టీఆర్‌లు కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ తమను కోరారని అయితే రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపి వారి కోరికను తిరస్కరించామన్నారు.అయితే ఇది జరిగిన కొద్ది రోజులకు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే వదిలేసినందుకు చాలా బాధపడ్డానని మరోసారి అటువంటి తప్పు పునరావృతం చేయరాదనే భావనతో మా ఎన్నికల్లో నిల్చుంటున్నామన్నారు.ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నంత ఐకమత్యం తెలుగు చిత్రపరిశ్రమలో లేదని తమిళనాడులో విశాల్,నాజర్‌లు అసోసియేషన్‌ను చాలా బాగ నడిపిస్తున్నారని తెలుగులో కూడా అటువంటి ఐకమత్యం కావాలన్నారు..