ప్రపంచానికి పెద్దన్నగా,ప్రపంచంలోనే అత్యంత ధనికదేశంగా పేరుగాంచిన అమెరికా దేశాధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం(వైట్‌హౌస్) ట్విట్టర్ ఖాతాలో భారత్‌ను మాత్రమే ఫాలో అవుతుండడంపై సర్వత్రా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ, భారత పీఎంవో కార్యాలయం, భారత రాష్ట్రపతి భవన్, ఇండియా ఇన్ యూఎస్ఏ, యూఎస్ ఎంబసీ ఇండియా ఖాతాలను మాత్రమే శ్వేత సౌధం అనుసరిస్తుండడం గమనార్హం. వైట్ హౌస్ ట్విట్టర్ ఖాతా మొత్తం 19 మంది ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతుండగా అందులో 14 మంది అమెరికన్లు ఉండగా మిగతా ఐదు ఖాతాలు భారత్కు సంబంధించినవే ఉన్నాయి.అమెరికాలో హౌడీ మోదీ, భారత్లో నమస్తే ట్రంప్ సభలు ఇరు దేశాల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలపర్చాయి. అంతేగాక, కరోనాతో అల్లాడుతున్న అమెరికాకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ కొనసాగిస్తోన్న స్నేహంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్వేత సౌధం భారతీయులను ఫాలో అవుతోంది.