న్యూఢిల్లీ : గతకొన్నిరోజులుగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అదానీ ముడపుల వ్యవహారంపైనా, మణిపూర్ సంక్షోభంపైనా చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం చర్చకు పెట్టనివ్వడం లేదు. ఉభయ సభల్ని సజావుగా జరగనివ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న, ఈరోజు లోక్‌సభలో భారత రాజ్యాంగం 75 వార్షికోత్సవం సందర్భంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో రాజ్యాంగం గురించి పలువురు సభ్యులు ప్రసంగించారు. బహుశా ఈరోజు భారత రాజ్యాంగంపై ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. మరోవైపు శనివారం ఉదయం పార్లమెంటు వెలుపల వయనాడ్ బాధితుల కోసం కేంద్రం రిలీఫ్ ప్యాకేజీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. వయనాడ్ ఎంపి ప్రియాంకగాంధీ, పలువురు ఎంపీలు కలిసి ‘జస్టిస్ ఫర్ వయనాడ్’ అనే రాసిన బ్యానర్‌ను పట్టుకుని నిరసన తెలిపారు. మరోవైపు రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌కి, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో 16-17 తేదీల్లో భారత రాజ్యాంగంపై చర్చ జరగనుంది.