పుల్వామా దాడిపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా భారత మాజీ మేజర్ జనరల్ గగన్ దీప్ బక్షి ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడితో 40 మంది జవాన్లు నెలకొరిగారు. దీంతో భారత్ పై పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించినట్లైంది .. దీనిని భారతదేశం పూర్తి చేస్తుందన్నారు. పుల్వామా ఘటనను సాకుగా చూపి భారత్ తమపై దాడికి దిగితే ప్రతి దాడి చేస్తామని మంగళవారం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడితో పాకిస్థాన్ యుద్ధం ఆరంభించిందని పేర్కొన్నారు. ఇక యుద్ధానికి ముగింపు పలుకాల్సింది భారత్ అని స్పష్టంచేశారు. ఓ వైపు దాడి చేసి .. మరోవైపు కపట నాటకాలు ఎలా ఆడుతారని మండిపడ్డారు. దాడి జరిగినా ఐదు రోజులకు స్పందించి .. దాడి చేస్తే ఊరుకోం అని చెప్పడం ఏంటనీ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఎన్నికైన ప్రధాని కాదని .. ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా ఎంపిక చేసిన ప్రధాని అని కామెంట్ చేశారు. అందుకే ఇమ్రాన్ ఖాన్ అదుపులో సైన్యం లేదని, సైన్యం అదుపులోనే ప్రధాని ఉన్నారని ఆరోపించారు. పుల్వామా దాడి ఘటనలో పాక్ ప్రమేయంపై ఆధారావ్వాలని ఇమ్రాన్ కోరడం దొంగే దొంగ అన్నట్టుందని వ్యాఖ్యానించారు. దాడి జరిగిన వెంటనే దాడి చేసింది తామేనని జైషే మహ్మద్ ప్రకటించింది. ఈ సంస్థ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ .. దీని చీఫ్ మసూద్ అజహర్ పాకిస్థాన్ లో నక్కి ఉన్నారు. ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలని ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు.