ఏపీ రాజధాని రూపు రేఖలు తీర్చిదిద్దటం దగ్గర్నుంచి.. నగర నిర్మాణం వరకు సింగపూర్ సహకారంతో తొలి అడుగులు పడ్డాయి. మహానగరానికి మొదటగా మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణంలో భాగమైన సింగపూర్ తో కలిసి రాజధానిలో వెల్ కమ్ గ్యాలరీ ఏర్పాటు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. స్టార్టప్ ఏరియా ఫేస్ వన్ దగ్గర నిర్మిస్తున్న ఈ వెల్ కమ్ గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు 69 మంది పెట్టుబడిదారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.రాజధాని అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వ సహకారం మరువలేనిదని ప్రశంసించారు. అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా మరువలేం అన్నారు చంద్రబాబు నాయుడు.ఆంధ్రప్రదేశ్‌తో ధృడమైన సంబంధాన్ని కోరుకుంటున్నామన్న ఈశ్వరన్… మొదటి దశలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. సింగపూర్, జపాన్, జర్మనీల నుంచి వెల్‌కం గ్యాలరీ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని.. ఇది ప్రారంభం మాత్రమేనని… భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.5 ఎకరాల్లో 44 కోట్లతో నిర్మిస్తున్న అమరావతి వెల్ కమ్ గ్యాలరీ నిర్మాణాన్ని 75 రోజుల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్దేశించుకుంది. రాజధాని నిర్మాణం పనులు కూడా ఏపీ ప్రజల అంచనాలకు తగ్గట్టే ప్రపంచస్థాయిలో ఉంటాయని చెబుతోంది ఏపీ ప్రభుత్వం.