న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారి రాబర్ట్ వాద్రా దేశాన్ని దోచుకున్నట్లు అంగీకరించినందుకు ఆయన భారత రత్న పురస్కారానికి అర్హులని భాజపా గురువారం ఎద్దేవా చేసింది. దేశాన్ని లూటీ చేసిన వ్యక్తులు పారిపోయారని, తాను ఇంకా దేశంలోనే ఉన్నానని రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలకు కమల నాధులు ట్వీట్‌లో ఈ మేరకు చురక లంటించారు. ‘రాబర్ట్ వాద్రా నిజాయితీ పరుడు. లూటీ చేశానని అంగీకరించినందుకు ధన్యవాదాలు. కుటుంబ వాటా కింద ఆయన భారత రత్న పురస్కారానికి అర్హులు’ అని ఎగతాళి చేసింది. ‘నేను దేశంలోనే ఉన్నాను. దేశాన్ని లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వ్యక్తులు ఉన్నారు. వారి గురించి ఏమంటారు? నేను ఎప్పుడూ దేశంలోనే ఉంటాను. నాపై ఉన్న అభియోగాలు తొలగిపోయేవరకు నేను దేశాన్ని వీడను. రాజకీయాల్లోకి రాను. అది నా హామీ’ అని వాద్రా బుధవారం మాధ్యమ ప్రతినిధులతో అన్నారు.