న్యూ ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించడం చాలా ముఖ్యమని పేర్కొంది. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి దేశవ్యాప్తంగా ఎస్ఐర్ను ప్రారంభించాలని నిర్ణయించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం షెడ్యూల్ ను నిర్ణీత సమయంలో జారీ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఈసీకి ఉంది. స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఐఆర్ నిర్వహించడం చాలా ముఖ్యం. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. గతంలో 1952-56, 1957, 1961, 1965, 1966, 1983-84, 1987-89, 1992, 1993, 1995, 2002, 2003 2004లో ఈసీ ఎస్ఐఆర్ ను చేపట్టింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలను కొత్తగా తయారు చేయడం కోసం ఎస్ఐర్ ను చేపట్టింది. బిహార్ లో చివరిగా ఎస్ఐఆర్ను 2003లో ఈసీ నిర్వహించింది. అర్హులెవరర్ని ఓటరు జాబితా నుంచి తొలగించం. అర్హులైన పౌరులందరిని ఓటర్ల జాబితాలో చేర్చాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి, అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరొక చోటుక వలస వెళ్లడం వల్ల ఈ మార్పులు జరిగాయి. కొంతమంది ఓటర్లు ఒక చోట ఓటు హక్కును నమోదు చేసుకుని, మరొక చోటుకు వెళ్లిపోతారు. కానీ అసలు నివాస స్థలంల ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధ్రువీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం.రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే అతడు/ఆమె భారతీయ పౌరుడిగా ఉండాలి.ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 21 సహా ఇతర నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ను నిర్దేశించే అధికారం ఈసీకి ఉంది.ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ను ప్రారంభించాలని ఈసీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది చివర్లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నందున అక్కడి తొలుత ఎస్ఐఆర్ చేపట్టాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఎస్ఐఆర్ కోసం షెడ్యూల్ ను సకాలంలో జారీ చేస్తాం.