పులివెందుల : దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతం సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య వెనుక ఆ ప్రాంతానికి చెందిన సుధాకర రెడ్డి హస్తమున్నట్లు వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ తండ్రి వైఎస్. రాజారెడ్డి హత్య కేసులో జైలు శిక్షను ముగించుకుని కడప సెంట్రల్ జైలు నుంచి ఇటీవలే అతను విడుదలయ్యాడు. తమ కుటుంబంపై అతనికి కక్ష ఉందని, కనుక అతని పాత్రపై దర్యాప్తు చేయాలని వివేకా కుటుంబ సభ్యులు పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. తొలుత వివేకాది సహజ మరణమని అనుకున్నారు. పోస్టుమార్టంలో ఆయన దారుణ హత్యకు గురైనట్లు తేలింది. అనంతరం ఆయన పీఏ కృష్ణారెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.