ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతున్నంతవరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుతోనే తన ప్రయాణమని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌సీబీ జట్టును వీడనని తెలిపాడు. త్వరలో జరుగనున్న ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న ఈ లీగ్ కోసం సిద్ధమవుతున్న కోహ్లీ.. ఆర్సీబీతో తనకున్న అనుబంధాన్ని ఆదివారం ఓ వీడియో రూపం లో విడుదల చేశాడు.’నమ్మకమే అన్నింటికంటే అత్యుత్తమమైనది. లీగ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని వ్యాఖ్య జోడించాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడుతున్న కోహ్లీ ఈ వీడియోలో.. గతంలో తన ఇంటర్వ్యూలతో పాటు డ్రెస్సింగ్ రూమ్ సరదా సన్నివేశాలను పంచుకున్నాడు. కసరత్తులు, సహచరులతో కలిసి డ్యాన్స్ చేయడం, ఎమోషనల్ స్పీచ్‌లతో ఈ వీడియో సాగింది.ఇక ఆర్‌సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న కోహ్లీ… రానున్న సీజన్‌లో ఎలాంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఆర్‌సీబీకి విధేయంగానే ఉంటానని చెప్పాడు. ‘ఆర్‌సీబీతో 12 సంవత్సరాలు అద్భుతంగా గడిచాయి. జట్టులో మా అందరి కోరిక టైటిల్‌ను సాధించడమే. ఈ సీజన్ కూడా ఎలా గడిచినా జట్టును వదిలే ప్రసక్తే లేదు. అసలు ఇప్పటివరకు ఆ ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఈసారైనా జట్టు బాగా ఆడుతుందా లేదా అని అభిమానులు ఉద్వేగంగా ఎదురుచూస్తున్నారు. మా ప్రదర్శన ఎలా ఉన్నా మాతో పాటు వారు కూడా ఆర్‌సీబీకి విధేయంగానే ఉంటారు. నేను ఐపీఎల్ ఆడుతున్నంతవరకు ఆర్‌సీబీలోనే ఉంటాను’ అని కోహ్లి వెల్లడించాడు.