న్యూ ఢిల్లీ: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన వినతి పై నవంబర్ 20 లోగా స్పందించాలని ప్రతి పక్ష నాయకుడు విజేందర్ గుప్త, ఎన్సీటీలకు ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం శుక్రవారం తాఖీదులు జారీ చేసిం ది. కేసును ఆ రోజుకే వాయిదా వేసింది. దిగువ కోర్టు గత నెల 8న జారీ చేసిన తాఖీదులపై నిలుపుదల ఉత్తర్వు విధించాలని కేజ్రీవాల్ చేసిన వినతిని తోసిపుచ్చింది. వ్యక్తిగత సిబ్బందితో తనను హత్య చేయడానికి భాజపా కుట్ర పన్నిందని లోక్సభ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ చేసిన ఆరోపణ ఢిల్లీ రాజకీయాల్లో దుమారాన్ని లేపింది. దీనిపై విజేందర్ గుప్తా, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాల మధ్య ట్విటర్లో యుద్ధం జరిగింది. తన సెక్యూరిటీని ఎత్తి వేయాలని ముఖ్యమంత్రే ఢిల్లీ పోలీసులకు చెప్పారని విజేందర్ గుప్తా ట్వీట్ చేశారు. ఎన్నికల్లో లబ్ది కే ఇలాంటి ఆరోపణలు చేసారని ఆరోపించారు. సీఎం హత్యకు కుట్ర జరుగుతోందని గుప్తా ట్వీట్ ద్వారా రుజువైందని మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఢిల్లీ పోలీసుల నుంచి సీఎం వ్యక్తి గత సమాచారాన్ని భాజపా సేకరిస్తోందని, కేజ్రీవాల్ హత్య కుట్రలో విజేందర్ గుప్తా కూడా ఉన్నారనీ . దీంతో కేజ్రీవాల్, సిసోడియా తన పరువుకు ముప్పు కలిగించారని విజేందర్ గుప్త కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు.