భోపాల్:బీజేపీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రి కైలాశ్ విజయ్‌వర్గీయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇండోర్‌లో ఇటీవల జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… మహిళలు చిట్టిపొట్టి దుస్తులు ధరించడం తనకు నచ్చదన్నారు. మహిళల ఆహార్యం విషయంలో పాశ్చాత్య, భారతీయ సాంస్కృతిక విలువల మధ్య వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ, “పాశ్చాత్య దేశాల్లో తక్కువ బట్టలు వేసుకున్న మహిళను అందంగా భావిస్తారు. నేను దాంతో ఏకీభవించను. ఇక్కడ భారతదేశంలో ఒక అమ్మాయి చక్కగా దుస్తులు ధరించి, ఆభరణాలు అలంకరించుకుని, హుందాగా ఉంటే అందంగా పరిగణిస్తాం. అలాగే తక్కువ మాట్లాడే నాయకుడిని మంచివాడిగా పరిగణిస్తారని ఒక నానుడి ఉంది. కానీ నేను దానిని నమ్మను. మహిళ దేవతా స్వరూపం అని నేను నమ్ముతాను. ఆమె మంచి దుస్తులు ధరించాలి” అని పేర్కొన్నారు.కొన్నిసార్లు తనతో సెల్ఫీలు దిగడానికి వచ్చే యువతులకు సరిగ్గా దుస్తులు ధరించమని సలహా ఇస్తాననీ వెల్లడించారు. “కొన్నిసార్లు అమ్మాయిలు నాతో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారు. నేను వాళ్లతో ‘బేటా, ఈ సారి మంచి బట్టలు వేసుకుని రా, అప్పుడు ఫోటో తీసుకుందాం’ అని చెబుతాను” అని ఆయన గుర్తుచేసుకున్నారు.మహిళల వస్త్రధారణపై విజయ్‌వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఇండోర్‌లో జరిగిన హనుమాన్ జయంతి కార్యక్రమంలో అసభ్యకరమైన దుస్తులు ధరించిన మహిళలను హిందూ పురాణాల్లోని రాక్షసి శూర్పణఖతో పోల్చారు. “మనం మహిళలను దేవతలు అంటాం. కానీ వారు అలా కనిపించరు… దేవుడు మీకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు. కనీసం మంచి బట్టలైనా వేసుకోండి” అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆయన తాజా వ్యాఖ్యలు మహిళల పట్ల తిరోగమన మూస పద్ధతులను ప్రోత్సహిస్తున్నాయని, వారి వస్త్రధారణపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.