చెన్నై: కరోనా టీకాల్ని దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గురువారం ఇక్కడ డిమాండు చేసారు. కేంద్రం తాత్సారం వల్లే కరోనా శర వేగంగా వ్యాపిస్తోందని దుయ్యబట్టారు. బట్టకొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాది నుంచి వస్తున్న సమాచారం దక్షిణాది ప్రజలను భయపెట్టిస్తోందన్నారు. ప్రజలను కాపాడేందుకు కేంద్రం తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆమ్లజని, టీకాల కొరత ఎక్కువగా ఉందని వార్తా పత్రికలు చెప్తున్నాయన్నారు. మొదటి దశ నివారణలో చేసిన తప్పుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. రెండో దశలో కూడా అలాంటి పొరపాట్లే చేస్తున్నారని మండిపడ్డారు. దాని ఫలితాన్ని ఇప్పుడు మనమందరం అనుభవిస్తున్నామని ఆక్రోశించారు.