25 ఏళ్ల వారికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి : సోనియా

25 ఏళ్ల వారికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలి : సోనియా

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ వయోపరిమితిని 25 ఏళ్లకు కేంద్రం తగ్గించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అర్హులైన ప్రజలందరికీ రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితి, దీనికి ఎదుర్కొనేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారంనాడు వర్చువల్ మీట్ నిర్వహించింది. కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కూడా సమావేశంలో సమీక్షించారు. ‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పరిస్థితిని సమీక్షించాను. కోవిడ్ సంక్షోభాన్ని కనిపెట్టడంలో, నిరోధించడంలో మోదీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా, ఏమాత్రం సంసిద్ధంగా లేదనే విషయం నా దృష్టికి వస్తుంది’ అని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ అన్నారు. ప్రధానికి తాను లేఖ రాశానని, కాంగ్రెస్ సీఎంలు సైతం సంబంధిత మంత్రులతో ఉపశమన చర్యల కోసం లేఖలు రాశారని అన్నారు. “కేంద్రానికి నెలలు తరబడి చెప్పినా ససేమిరా అంటూ నిరాకరిస్తూ వచ్చింది. ఇప్పుడు వాస్తవం గ్రహించింది. ఎమర్జెన్సీ వినియోగానికి ఇతరులతో కలిసి వ్యాక్సిన్ డవలప్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రియారిటీ విషయంలోనూ ఇమ్యునేషన్ వయో పరిమితిని 25 ఏళ్లకు తగ్గించాలి” అని సోనియాగాంధీ సీడబ్ల్యూసీ మీట్‌లో స్పష్టం చేశారు.
అర్హులకు నెలవారీ సాయం అనివార్యం..
పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధిస్తున్నందున అర్హులైన పౌరులందరికీ కేంద్రం రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ”కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పాక్షిక కర్ఫ్యూలు, ప్రయాణాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలపై కూడా తిరిగి ఆంక్షలు అమలవుతున్నాయి. ఇది పేదలకు శరాఘాతమవుతోంది. అర్హులైన దేశ పౌరులందరికీ రూ.6,000 చొప్పున వారి అకౌంట్లలో నేరుగా జమ చేయడం అనివార్యం” అని సోనియాగాంధీ అన్నారు. సీడబ్ల్యూసీ వర్చువల్ మీట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పి.చిదంబరం, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు సైతం, దేశవ్యాప్త వ్యాక్సిన్ డ్రైవ్ నత్తనడకన నడుస్తుండటంపై కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, పేద ప్రజలను ఆదుకునేందుకు వారి అకౌంట్లకు నేరుగా నగదును జమ చేయాలని కోరుతూ ప్రధానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లేఖలు సైతం రాశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos