న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిని కేవలం ప్రమాదంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించినందుకు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వి.కె. సింగ్ ఆగ్రహించారు. మంగళవారం ఆయన రాంచిలో మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించడం కూడా ప్రమాదమా లేక తీవ్ర వాద దాడా? స్పందించాలని దిగ్విజయ్ సింగ్ ను డిమాండు చేసారు. పాకిస్తాన్‌లోని బాలా కోట్‌లో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన భారత వాయుసేన జరిపిన దాడుల్లో 250 మందికి పైగా తీవ్రవాదులు హతమైనట్లు భాజపా అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనను చాలా మంది మృతి చెందినట్లు భావించాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అది కేవలం అంచనా మాత్రమే. కచ్చితంగా ఇంతమంది చనిపోయరని అమిత్ షా చెప్పలేదు. చాలా మంది చనిపోయి ఉంటారని మాత్రమే చెప్పార’ని వివరించారు. ‘వైమానిక దాడులకు గురైన భవనాలల్లో ఎందరు ఉన్నారనే దాని పైనే మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు. పాకిస్తాన్‌లోని ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అత్యంత జాగ్రత్తగా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా దిగ్విజయ సింగ్ పేర్కొనటం ఇక్కడ ప్రస్తావనార్హం.