న్యూ ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కాలమానం ప్రకారం, ఆగస్టు 27వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి 12.01 గంటల నుంచి (అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో) సుంకాలు అమల్లోకి వస్తాయని అగ్రరాజ్యం తెలిపింది. అప్పటి నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు 50 శాతం టారిఫ్‌లు వర్తిస్తాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. భారత్‌పై గతంలో ట్రంప్, 25 శాతం సుంకాలు విధించారు. అవి ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25 శాతం అదనపు టారిఫ్‌లను విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత్‌పై మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ట్రంప్ టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై ప్రభావం పడనుంది.