హోసూరు : ఇక్కడ కర్మాగారాలలో పని చేస్తున్న 1600 మంది వలస కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా ఉత్తరప్రదేశ్ కు బయలుదేరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హోసూరు ప్రాంతంలో వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. గత 50 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హోసూరు, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వలస కార్మికులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో తమ సొంత రాష్ట్రాలకు పంపించాలని వలస కార్మికులు ఈ-పాస్ లకోసం దరఖాస్తు చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనుమతి పొంది కొందరు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోగా, వేల మంది వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా వలస కార్మికులను సొంత ఊళ్లకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హోసూరు నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. హోసూరు ప్రాంతంలో పని చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1600 మంది వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైలులో పంపించారు. కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకరన్ హోసూరు రైల్వే స్టేషన్‌కు వచ్చి వారికి ఆహార ప్యాకెట్లను అందజేసి వీడ్కోలు పలికారు. హోసూరు నుంచి బెంగళూరు, జోలారుపేట, రేణిగుంట మీదుగా ప్రత్యేక రైలు ఉత్తరప్రదేశ్‌కు వెళ్ళింది. గట్టి పోలీసుల బందోబస్తు మధ్య వారిని హోసూరు నుంచి సాగనంపారు.