కాన్పూర్ : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతి మకిలి అంటుకుంది. సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయాన్ని నిర్ధారించారు. తమ ఎమ్మెల్యేలు నెలవారీ జీతాలు డ్రా చేయడమే కాక, ఎమ్మెల్యే నిధుల నుంచి 10 శాతం కమీషన్లు కూడా పొందుతారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ త్రివేది పేర్కొన్న వీడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. బుధవారం కాన్పూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేల అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియోలో కిద్వాయ్‌నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేలు జీతాలతో పాటు ఎమ్మెల్యే నిధి నుంచి కమీషన్లు కూడా పొందుతూ రెండు విధాలుగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. అయితే కింది స్థాయి కార్యకర్తలకు ప్రతిఫలంగా ఏమీ లభించడం లేదు’ అని అన్నారు. కాగా, హిందువులు తమ రక్షణ కోసం కత్తులు, లాఠీలు తమ ఇళ్లలో ఉంచుకోవాలని ఆయన సూచించడం మరింత వివాదం రేకెత్తించింది. అలాగే ఆయన హిందువులను జంతువుల కన్నా అధ్వాన్నమంటూ పోల్చారు. జంతువులు తమకు ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి కొమ్ములను ఉపయోగించి తిరగబడతాయని, కానీ హిందువులు స్వీయ రక్షణ కోసం ప్రయత్నించరని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై యోగి సర్కారుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డాయి.