హొసూరు : హొసూరు – శూలగిరి జాతీయ రహదారిలోని బత్తలపల్లి వద్ద గల సర్వీసు రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. జాతీయ రహదారిని ఆనుకుని హడ్కో పోలీసు స్టేషన్ ఉంది. దీని పరిధిలో వివిధ కేసులలో పట్టుబడ్డ లారీలను జాతీయ రహదారిని ఆనుకుని ఉండే సర్వీసు రోడ్డుకు ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు. తద్వారా రోడ్డు ఇరుకుగా మారింది. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో బత్తలపల్లి కూరగాయల మార్కెట్, అదే ప్రాంతంలో చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం జాతీయ రహదారిపై వాహనాల సంచారం ఎక్కువగా ఉండడంతో వాహన చోదకులు సర్వీసు రోడ్డును ఆశ్రయిస్తున్నారు. ఇరువైపులా నిలిపి ఉంచిన లారీల వల్ల తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనుక వెంటనే వాటిని తొలగించే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు. ఇరువైపులా నిలిపిన లారీలను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు పలుమార్లు సూచించినా పోలీసులు పట్టించుకోలేదని, దీని వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. ఇకనైనా పోలీసులు స్పందించి సర్వీసు రోడ్డు వాహన సంచారానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.