నా పాట పది.. నా పాట పదిహేను. ఇవి వందలు వేలు కాదు.. అక్షరాలా లక్షలు.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచి స్థానాన్ని దక్కించుకునేందుకు కొందరు ఆశావహులు ఇలా అర్రాస్(వేలం పాట)లకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అసలు పోటీకే రాకుండా ఉండేందుకు కొన్నిచోట్ల కొందరు రూ.లక్షలు సమర్పిస్తున్నారు. మరికొన్నిచోట్ల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం వరకు వేచిచూసి వేలం పాటలకు దిగాలని మరికొందరు ఎదురుచూస్తున్నారు.
ఆదాయం ఉన్నచోట్ల ఏకగ్రీవాలకు పట్టు
పంచాయతీలకు ఆదాయ వనరులు ఉన్నచోట ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉన్న ప్రాంతాలు, జాతీయ రహదారుల వెంబడి ఉన్న పంచాయతీల్లో పాలకవర్గాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పట్టణాలను ఆనుకుని ఉన్న పంచాయతీలకు కూడా ధర బాగా పలుకుతోంది. అనేక చోట్ల ఇప్పటికే వేలం పాటలు, లోపాయికారిగా ఒప్పందాలు పూర్తయినా ఎన్నికల నిబంధనలతో అవి వెలుగు చూడటం లేదు.
* మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొన్ని మండలాల్లో పలుచోట్ల ఏకగ్రీవ ఒప్పందాలు పూర్తయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ బేరసారాలు చోటుచేసుకుంటున్నాయి.
* వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఓ పంచాయతీకి రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించేందుకు కొందరు ముందుకొచ్చారు. మరికొన్నిచోట్ల చర్చలు సాగుతున్నాయి.
* సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంలో మూడు పంచాయతీలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఒక పంచాయతీకి రూ.30 లక్షల వరకు చెల్లించేందుకు ఓ నాయకుడు ముందుకు వచ్చారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఒప్పుకోకుండా ఆ నాయకుడికి పోటీగా అతని సోదరుడితో నామినేషన్ వేయించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరో పంచాయతీకి రూ.7 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
* నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో మూడో దశ ఎన్నికల్లో ఉన్న ఓ పంచాయతీకి రూ.ఆరున్నర లక్షలు ఇచ్చేందుకు బేరసారాలు నడుస్తున్నాయి. మరో పంచాయతీలో ఏడు కుల సంఘాలు ఉండగా సంఘానికి రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సంప్రదింపులు సాగుతున్నాయి. లేదంటే గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించినట్లు తెలిసింది.
రూపుమారుతున్న ఏకగ్రీవం
ఒకప్పుడు ఆదర్శంగా నిలిచేందుకు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ప్రజలు ఎన్నుకునేవారు. ప్రస్తుతం ధన ప్రభావంతో ఏకగ్రీవం అంటే ప్రజలకు ఏమీ ఇవ్వకపోయినా కనీసం పంచాయతీ అభివృద్ధికైనా కొంత డిపాజిట్ చేయాలన్న డిమాండ్ అన్నిచోట్లా వినిపిస్తోంది. కొన్నిచోట్ల మాత్రం నిజాయతీ ఉన్న నాయకులను ఏకగ్రీవంగా నిలబెడుతున్న పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇలా ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం రూ.10 లక్షలు నజరానాగా ఇవ్వనుంది.