భోపాల్ : నిరుద్యోగులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఉద్యోగాలు ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నగరంలో ఆందోళనకు దిగిన నిరుద్యోగులపై పోలీసులు విరుచుకు పడ్డారు. లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించడంపై మండిపడింది. బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వంపై విమర్శలు గుప్పించింది. ఆందోళనకారులు నీలం పార్కు నుంచి రాజ్భవన్ వైపు పరుగులు తీస్తుండటంతో స్వల్ప లాఠీచార్జి చేశామని పోలీసులు చెప్పారు. 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని, ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని వివరించారు. నిరుద్యోగంపై ఉద్యమం పేరుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. నిరుద్యోగులపై లాఠీచార్జి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.