ఉజ్జయిని : ఇక్కడి మహాకాలేశ్వర దేవాలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలోని ఫుడ్ సెంటర్ లో గల యంత్రంలో దుపట్టా చిక్కుకుని మహిళ మృతి చెందింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రజనీ ఖత్రీ అనే 30 ఏళ్ల మహిళ శనివారం ఉదయం ఆలయంలోని అన్న క్షేత్రంలోగల వంటగదిలో పనిచేస్తోంది. ఆ సమయంలో ఆమె మెడకు ఉన్న దుపట్టా బంగాళాదుంపలు కట్ చేసే యంత్రంలో చిక్కుకుపోయింది. అనంతరం దుపట్టా ఆమె మెడకు బిగుసుకుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. గమనించిన సిబ్బంది రజనీ ఖత్రీని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక తర్వాత ఆమె మృతికి గల కచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.