ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత శుక్రవారం నోరు విప్పిన ఉద్ధవ్ థాకరే భాజపా పై తీవ్ర స్థాయిలో విరుచు కుపడ్డారు.‘‘బీజేపీకి ఇప్పుడు దొరికిన ఆనందం ఏంటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి ఏం రాలేదు. మరి అలాంటప్పుడు కుర్చీ పంపకంపై అప్పుడు ఎందుకు వ్యతిరేకించ నట్టు? నన్ను వెనక్కి నెట్టారు. ముంబైని వెనక్కి నెట్టకండి. ఆరే కాలనీ విషయంలో నిర్ణయం మార్పుకోవడం సరైంది కాదు. మేం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాం. అది నచ్చకపోతే ఆరేకు నష్టం జరక్కుండా ఇంకా ఎలా అయినా ఆలోచించండి. పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోండి’’ అని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన తొలి మంత్రి వర్గ సమావేశంలో ఆరెపై మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరగ రాశారు. మెట్రో లైన్-3 కార్ షెడ్‌ను ఆరె కాలనీ నుంచి కంజుర్‌మార్గ్‌కు మార్చారు. దీనిని కంజుర్మార్గ్ నుంచి మళ్లీ ఆరె కాలనీకి మారుస్తూ తాజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.