చెన్నై : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా రాష్ట్ర మంత్రి ఉదయనిధి, ఎంపీ రాజా చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో ఆధారాలు సమర్పించాలని మద్రాసు హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. చెన్నైలో ద్రావిడ కళగం ఆధ్వర్యంలో జరిగిన సభలో రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ సభలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు పాల్గొన్నారు. కొద్ది రోజుల తర్వాత డీఎంకే ఎంపీ రాజా మరో చోట జరిగిన సభలో సనాతన ధర్మం గురించి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విమర్శలు చేసిన మంత్రి ఉదయనిధి, సనాతనధర్మం వ్యతిరేక మహానాడులో పాల్గొన్న మంత్రి శేఖర్‌బాబు, డీఎంకే ఎంపీ రాజా పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ కిశోర్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ముగ్గురిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి అనితా సుమంత్ ఎదుట విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా మంత్రి ఉదయనిధి, డీఎంకే ఎంపీ రాజా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదనలు వినిపిస్తూ.. రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని, తమ పదవులను కోల్పోయే దిశగా ముగ్గురూ ఎలాంటి అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలుగానీ, విమర్శలు గానీ చేయలేదని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని పేర్కొనడం ఎలా శిక్షార్హమవుతుందని ప్రశ్నించారు. మంత్రి పీకే శేఖర్‌బాబు తరఫున హాజరైన న్యాయవాది జ్యోతి వాదనలు వినిపిస్తూ.. మంత్రి ఉదయనిధి, ఎంపీ రాజా ప్రసంగాలకు సంబంధించి ఎలాంటి వీడియో ఆధారాలను సమర్పించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రకం పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపడం సమంజసంగా ఉంటుందన్నారు. సింగిల్ జడ్జి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి వీలులేదన్నారు. అన్ని పక్షాల వాదప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి అనితా సుమంత్ స్పందిస్తూ… సనాతన ధర్మం గురించి మంత్రులు ఉదయనిధి, శేఖర్‌బాబు, ఎంపీ రాజా చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో ఆధారాలను సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణ ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు.