న్యూఢిల్లీ : స్వేచ్ఛ, అరమరికలు లేకుండా మాట్లాడుకోవడాన్ని అడ్డుకునే నిబంధనలను మార్చాలని కోరనున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ట్విటర్ గురువారం పదునైన పదజాలంతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘మా అంతర్జాతీయ సేవా నిబంధనల అమలుకు ప్రతిస్పందనగా పోలీసులు బెదిరింపు వ్యూహాలను ఉపయోగించడం, కొత్త ఐటీ నియమావళి పట్ల , భారత పౌర సమాజంలో చాలా మందితో పాటు మాకు కూడా ఆందోళన ఉంది’’ అని పేర్కొంది. స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా, బహిరంగంగా మాట్లాడుకోవడానికి ఆటంకాలు కల్పించే ఈ నిబంధనల్లో మార్పు కోసం వాదనలు వినిపించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపింది. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని, పరస్పర గౌరవభావం, సహకారంతో కూడిన వైఖరిని అనుసరించడం చాలా ముఖ్యమని నమ్ముతున్నట్లు తెలిపింది. ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన సమష్టి బాధ్యత ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, పరిశ్రమ, పౌర సమాజానికి ఉందని పేర్కొంది. టూల్‌కిట్ పై బీజేపీ నేతల పోస్ట్‌లకు ట్విటర్ ‘‘మానిప్యులేటెడ్ మీడియా’’ అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు వెళ్ళారు. దీంతో ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.