బెంగళూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనప్పటికీ తనను బహుజన సమాజ పార్టీ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించిందని కొళ్లేగాల శాసన సభ్యుడు ఎన్.మహేశ్ ఆక్రోశించారు. బుధ వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు.‘కుమార స్వామి విధాన సభలో ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానాన్ని మంగళవారం విధానసభకు హాజరై సమర్థించాలని మా పార్టీ అధినేత మాయావతి సోమవారం సాయంత్రం ట్విట్టర్లో సూచించారు. నాకు ట్విట్టర్ చూసే అలవాటు లేదు. గత కొన్ని రోజులుగా ధ్యానంలో నిమగ్నమయ్యాను. అందువల్ల ఆమె ఆదేశాన్ని పాటించ లేక పోయాను. బుధవారం ఉదయం పత్రికల్లో నన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. త్వరలోనే అన్ని సర్ధుకుంటుందని’ పేర్కొన్నారు. ‘మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్తో బిఎస్పీ మహాఘట బంధన్ తెగి పోయాక మంత్రి పదవికి రాజీనామా చేయమన్నారు. చేసాను. తదుపరి తటస్థంగా ఉండేందుకు అంగీకరించారు. విశ్వాస తీర్మాన వోంటిగ్ కూ వెళ్లాల్సిన పని లేదని పార్టీ కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అశోక్ సిద్ధార్థ కూడా చెప్పారు. మా నియోజక వర్గంలో ఒకరు ప్రమాదానికి గురి కావటంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లాను. అతడి సంరక్షణలోనూ ఉన్నాను. తీరా తిరిగి ఇక్కడకు వచ్చేసరికి ఇలా జరిగిందని’విపులీకరించారు.