అధికారం చేతిలో ఉందనే అహమో లేక తెలంగాణలో తమను ఎదురించే పార్టీలే లేకుండా పోయాయనే అభిప్రాయమో తెలియదు కానీ తెరాస నేతలకు రోజురోజుకు అహంకారం,అహంభావం విపరీతంగా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.ఇన్ని రోజులు ప్రత్యర్థ పార్టీలపై విమర్శలు,ఆరోపణలు చేస్తూ వచ్చిన తెరాస నేతలు తాజాగా ప్రజలనే విమర్శిస్తూ ఒక రకంగా బెదిరింపులకు పాల్పడే ధోరణితో ప్రవర్తిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు తరపున ప్రచారాల్లో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయకుంటే ప్రజలను కుక్కలు కూడా పట్టించుకోవంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు.శాసనసభ ఎన్నికల్లో పాలేరులో నన్ను ఓడించడం వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటని ప్రశ్నించిన తుమ్మల నాగేశ్వరరావు మీరు వేసిన ఓట్లు మురికి కాలువలో కొట్టుకుపోయాయంటూ ప్రజలను విమర్శించారు.ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నాడని నన్ను ఓడించినట్లు నామాను కూడా ఓడిస్తే మీ గతి కుక్కలు కూడా చూడవంటూ నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు.తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చిన్నతనంగా ఫీలవని నేను మొదటిసారి ప్రజలు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల చాలా ఫీలయ్యానని శెలవిచ్చాడు తుమ్మల.ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లు మరచి ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును గెలిపించాలంఊ ప్రజలకు ఆఫర్ ప్రకటించాడు మన తుమ్మల నాగేశ్వరరావు.ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా తానేమి తక్కువ తినలేదంటూ అంతకుముందు రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో రుజువు చేసుకున్నాడు.ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కూడా ఎర్రబెల్లే నిర్ణయించేస్తున్నాడు.రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నేను మంత్రిని మీ పింఛన్లు,రుణాలు మంజూరు చేయాల్సింది నేనే.తెరాసకు ఓట్లు వేయకుంటే మీరు రావాల్సినవి ఒక్కటి కూడా రావు అంటూ బెదిరించాడు.మీ గ్రామాలు అభివృద్ధి చెందవంటూ ప్రజలను మానసికంగా బెదిరించడానికి ప్రయత్నించాడు మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు.ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేయాలో ఎవరికి వేయకూడదో ప్రజలు నిర్ణయించుకుంటారు.ఒక అభ్యర్థికి ఎందుకు ఓటు వేయాలో ప్రతీ ఒక్కరికి వారి వారి కారణాలు ఉంటాయి.అంత మాత్రాన ప్రజల తీర్పునే తప్పుబడితే ఎలా?అధికార గర్వంతో ఇలా ప్రజలను శాసించాలని ప్రయత్నించిన ఎంతోమంది నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోయి కాలగర్భంలో కలసిపోయారనే విషయం అధికార దర్పంతో నాలుకపై నరం లేకుండా ప్రజలను విమర్శిస్తూ అహంకార పూరిత వ్యాఖ్యలు చేస్తున్న తెరాస నేతలు గుర్తుంచుకోవాలి..