హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ 37 ఏళ్ల ప్రస్థానంలో తొలిసారిగా తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడా పోటీ చేయడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తెలంగాణలో మంచి పట్టు ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీ ప్రాభవం రోజు రోజుకు మసకబారుతోంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను కేవలం 13 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తు ఉన్నందువల్ల తక్కువ స్థానాల్లోనే పోటీ చేసి, రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందగా, ఒక ఎమ్మెల్యే ఇప్పటికే తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో పార్టీ ఉనికిని చాటుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో రెండు నుంచి అయిదు స్థానాల్లో అయినా పోటీ చేయాలని రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు వద్ద ప్రతిపాదించినా, ప్రయోజనం లేకుండాపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దశలో రాష్ట్రంలో తెదేపాకు 44.82 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఏడాది శాసన సభ ఎన్నికల్లో అది 3.5 శాతానికి కుంగిపోయింది.
అన్నీ ఆలోచించే…
రాష్ట్రంలో
నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించామని టీటీడీపీ
అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తమ పార్టీ పోటీ చేస్తే తెరాస, భాజపాలకు అనుకూలించవచ్చని,
పోటీ చేయకపోతే కాంగ్రెస్ లాభపడవచ్చని ఆయన అంచనా వేశారు.