అమరావతి:వైఎస్సార్సీపీ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం వివిధ డెయిరీల ద్వారా టీటీడీకి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేసి భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ రూ.240 కోట్లు లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలిందని సిట్ హైకోర్టుకు నివేదించింది. ఆవు నెయ్యి మాదిరి రంగు, సువాసన వచ్చేందుకు పామాయిల్లో రసాయనాలు కలిపారని పేర్కొంది. ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చిన నకిలీ నెయ్యిని తమిళనాడులో ఉన్న ఏఆర్ డెయిరీ, శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న వైష్ణవీ డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని తెలిపింది. ఆవు నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నట్లు తెరపైకి కనిపించేది ఏఆర్, వైష్ణవీ డెయిరీలైనా వెనకుండి కథ నడిపించింది భోలేబాబా డెయిరీ డైరెక్టర్లేనని సిట్ స్పష్టం చేసింది. నేర సమయంలో పొమిల్ జైన్, విపిన్ జైన్ వైష్ణవీ డెయిరీలోనూ డైరెక్టర్లుగా వ్యవహరించారని వివరించింది. నకిలీ నెయ్యి సరఫరాకు సహకరించినందుకు ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీలకు భోలేబాబా డైరెక్టర్లు కేజీ నెయ్యికి 3 రూపాయల కమిషన్ ముట్టజెప్పారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్. శ్రీరామ్, సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. నెయ్యి సరఫరా ఒప్పందం ఏఆర్ డెయిరీ, టీటీడీ మధ్య జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో భోలేబాబా, వైష్ణవీ డెయిరీలను లాగడం సరికాదని తెలిపారు. గత నాలుగు నెలలుగా పిటిషనర్లు జైల్లో ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అన్ని ఆధారాలు ఇప్పటికే సిట్ చేతిలో ఉన్నాయని చెప్పారు. పిటిషనర్లు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని ఎలాంటి షరతులైన విధించి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది కోరారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో వైష్ణవీ డెయిరీ సీఈఓ అపూర్వ వినయ్‌కాంత్ చావడా బెయిల్‌పై తీర్పు రిజర్వైంది. మరికొన్ని వివరాలు సమర్పించడం కోసం ఏ3, ఏ4 వ్యాజ్యాలపై విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.