తిరుపతి: స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో తితిదే విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. స్థానికులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం ఎల్-1 ఇవ్వాలని కోరుతూ మంగళవారం అలిపిరి పాదాల మండపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాటా, బిర్లా, అంబానీ వంటి వారికి శ్రీవారి దర్శనంలో సకల సదుపాయాలు కల్పిస్తున్నారని, స్వామివారి పాదాలచెంత ఉన్న స్థానికులను మాత్రం దర్శనానికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా స్థానికులకు ప్రతిరోజు ఒక గంట పాటు ఎల్-1 దర్శనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో స్థానికులకు ప్రత్యేకంగా దర్శనం ఇస్తున్నా.. తిరుమలలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. శబరిమల ఆలయం సోషలిజం వైపు పయనిస్తుంటే.. తితిదే మాత్రం క్యాపిటలిజం దిశగా సాగుతోందని ఎద్దేవా చేశారు. తితిదేలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు సైతం ఎల్-1 దర్శనానికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా స్థానికుల కోరికలను బలంగా వినిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రమీలమ్మ, డాక్టర్ చింతా భరత్, పూతలపట్టు ప్రభాకర్, సిద్ధయ్య, శాంతి యాదవ్, తేజోవతి, మునిశోభ తదితరులు పాల్గొన్నారు.