ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మొదటినుంచి
పోటీతత్వం నెలకొంది.ఈ ఐదేళ్లలో అది మరింత ముదిరింది కూడా.ఇరు రాష్ట్రాల ప్రజల్లో ఎటువంటి
బేధభావాలు లేకపోయినా కేవలం తమ రాజకీయ లబ్ది కోసం,అధికారం కోసం రెండు రాష్ట్రాల రాజకీయ
పార్టీల నేతలు ప్రజల్లో విద్వేషాలు ఉసిగొల్పుతున్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రతీ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ మంకుపట్టుగా ఉంటున్నారు.అభివృద్ధి
విషయంలో పక్క రాష్ట్రాలతో పోటీ పడితే చూడడానికి అందంగా ఉంటుంది కానీ ఏంచేసినా పక్క
రాష్ట్రం కంటే ముందే చేయానలే తాపత్రయంతో ప్రజల భవిష్యత్తుతో ఆడుకుకునే విధంగా నిర్ణయాలు
తీసుకోవడం ఉత్తమం కాదు.తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకొని
ఇంటర్మిడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది
రోజుల క్రితం ఇంటర్మిడియట్ మొదటి,రెండవ సంవత్సరం పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే.ఈ
క్రమంలో ఈనెల 10వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.దీంతో
మాకంటే ముందు ఎలా ప్రకటిస్తారా అనే ఈగోతో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వెల్లడించే
ఒక్కరోజు ముందుగానే తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వెల్లడించాలంటూ అధికారులకు ఆదేశించినట్లు
సమాచారం.ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్9వ తేదీకి ఫలితాలు వెల్లడయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సాధ్యమైనంత త్వరగా జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి
చేయడానికి అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.అందులో భాగంగా మూల్యాంకనం చేస్తున్న
అధ్యాపకులపై అదనపు భారం మోపినట్లు తెలుస్తోంది.ప్రతీరోజూ 30 జవాబు పత్రాలు మూల్యాంకనం
చేస్తున్న అధ్యాపకులతో 45 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయిస్తున్నారు.అదనపు భారం పడడంతో
ఒత్తిడికి గురవుతున్నామని దీంతో మూల్యాంకనంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధ్యాపకులు
తెలుపుతున్నారు. దీంతోపాటు మూల్యాంకనం ప్రక్రియపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో మూల్యాంకనం
సరిగా జరగడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.పది గంటల నుంచి సాయంత్రం నాలుగు
గంటల వరకు మూల్యాంకం చేయాల్సి ఉండగా పర్యవేక్షణ కరువవడంతో మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి
సాయంత్రం నాలుగు గంటలకు ఇష్టమొచ్చిన విధంగా 45 జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి వెళ్లిపోతున్నారనే
ఆరోపణలు వినిపిస్తున్నాయి.కార్పోరేట్ కాలేజీలు తమ కాలేజీ అధ్యాపకులను మూల్యాంకనానికి
పంపించకుండా ట్యూటర్లను పంపించడంతో మూల్యాంకనం అస్తవ్యస్తంగా జరుగుతోందనే విమర్శలు
కూడా వినిపిస్తున్నాయి.ఇవేమి పట్టించుకోని ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
కంటే ఒక్కరోజు ముందు ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలనే మంకుపట్టుతో వ్యవహరిస్తూ విద్యార్థుల
భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శలు వస్తున్నాయి..