వాషింగ్టన్:రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పటి వరకూ ఉక్రెయిన్‌పై మాత్రమే ఒత్తిడి తెచ్చిన ట్రంప్ తాజాాగా రష్యాపై దృష్టిపెట్టారు. ఉక్రెయిన్‌తో రష్యా శాంతి ఒప్పందానికి వచ్చే వరకు ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు విధించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణతో పాటు శాంతి నెలకొల్పే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. ‘ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. వాటి ఆధారంగానే రష్యాపై భారీ స్థాయిలో బ్యాంకింగ్ ఆంక్షలు, సాధారణ ఆంక్షలు, సుంకాలు విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నా. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేరుకునే వరకు ఇవి కొనసాగుతాయి.ఆలస్యం కాకముందే రష్యా, ఉక్రెయిన్‌లు చర్చలకు సిద్ధం కావాలి’ అని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పుతిన్ యుద్ధం ముగించకుంటే భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు సైనిక సాయం, నిఘా సమాచారం నిలిపివేసిన అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు శాటిలైట్ చిత్రాల యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. శ్వేతసౌధంలో ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు రష్యాతో పోరాడేందుకు ఈ ఉపగ్రహ చిత్రాలు ఉక్రెయిన్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. దీంతో జెలెన్‌స్కీ సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.
‘ఉక్రెయిన్ పోలిస్తే రష్యాతోనే ఈజీ’
మరోవైపు ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యాతో డీల్ చేయడం చాలా సులభమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘ఉక్రెయిన్ వద్ద అంత బలం లేదు. అయినా వారితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంది. రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ. ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌పై నాకు విశ్వాసం ఉంది. నాకు ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.