సీటెల్ : శరణార్థులకు సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులపై పలు శరణార్థుల సహాయ సంస్థలు కోర్టులో దావా వేశాయి. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ప్రకటించాలని సీటెల్‌లోని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యం పేర్కొంది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని, శరణార్థులకు అందించే సాయాన్ని పునరుద్ధరించాలని కోర్టును కోరింది.కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఉత్తర్వులను జారీ చేయలేరని అంతర్జాతీయ శరణార్థుల సహాయ ప్రాజెక్ట్ న్యాయవాది మెలిస్సా కినీ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ”శరణార్థులను రక్షించడంలో అమెరికా నైతిక మరియు చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంది. ఈ చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు ఎక్కువకాలం కొనసాగితే పరిణామాలు మరింత భయంకరంగా ఉంటాయి” అని ఆ ప్రకటన పేర్కొంది.అంతర్జాతీయ శరణార్థుల సహాయ ప్రాజెక్టులో భాగమైన చర్చ్ వరల్డ్ సర్వీస్, యూదు శరణార్థుల పునరావాస సంస్థ హెచ్‌ఐఎస్, లూథరన్ కమ్యూనిటీ సర్వీసెస్ నార్త్ వెస్ట్ మరియు శరణార్థులతో పాటు వ్యక్తులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. అమెరికా, విదేశాలలో ఉన్న శరణార్థులకు క్లిష్టమైన సేవలను అందించే ఈ సంస్థలు ట్రంప్ ఆదేశంతో తీవ్రంగా నిరోధించబడ్డాయని పిటిషన్ పేర్కొంది. అమెరికా వచ్చే శరణార్థులపై ఇది ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది.