ధూమపానం ఆరోగ్యానికి హానికరం,ధూమపాపనం ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారి తీస్తుందంటూ సిగరెట్ ప్యాకెట్లపై సినిమా థియేటర్లు,బుల్లితెరలపై పెద్దపెద్ద అక్షరాలతో వేస్తున్నా పొగరాయుళ్లలో ఏమాత్రం మార్పు రావడం లేదు.ఇక ధూమపానానికి బానిసలై చైన్‌స్మోకర్లుగా మారిన వ్యక్తులైతే రోజుకు కనీసం 15 సిగరెట్లు తాగకుండా ఉండలేకపోతుంటారు.దీనివల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలిసినా దమ్ముపై దమ్ము లాగుతూనే ఉంటారు.అలా హద్దు లేకుండా సిగరెట్లు తాగితే ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా తయారవుతుందో కళ్లకు కట్టేవిధంగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.చైనాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం మృతి చెందగా వైద్యులు సదరు వ్యక్తి అవయవాలను ఇతరులకు అమర్చడం కోసం అవయవాలు సేకరించడానికి ఉపక్రమించారు.ఈ క్రమంలో ఊపిరితిత్తులను చూసి వైద్యులే షాక్ తిన్నారు.పూర్తిగా నలుపు రంగులోకి మారిన ఊపిరితిత్తులు చూసిన వైద్యులు మృతి చెందిన వ్యక్తి 30 ఏళ్లుగా చైన్‌స్మోకింగ్ చేయడం వల్లే ఊపిరితిత్తులు ఇలా అయ్యాయని వెల్లడించారు.