కరోనా వారియర్ ఇంట విషాదం

కరోనా వారియర్ ఇంట విషాదం

బెంగళూరు : కరోనాను కట్టడి చేయడంలో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కానీ అదే మహమ్మారి కారణంగా తన తల్లిదండ్రులతో పాటు బావను కూడా పోగొట్టుకున్నాడు. చివరకు తానూ కరోనా బారిన పడ్డాడు. బెంగళూరులోని బొమ్మనహళ్లి బీబీఎంపీ ఆరోగ్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ నాగేంద్ర కరోనాను కట్టడి చేయడంలో దక్షత గల అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. మూడు నెలల కిందట బొమ్మనహళ్లి పరిధిలోని హొంగసంద్రలో కరోనా జోరుగా వ్యాపించినప్పుడు సమర్థంగా పని చేశారు. 500 మంది దాకా స్థానికులకు వైరస్ సోకే ప్రమాదముందని గ్రహించి అనేక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సుమారు 120 మందిని హోం క్వారంటైన్లో ఉంచి చికిత్సలు అందించారు. తద్వారా అక్కడ కరోనా వ్యాపించకుండా చేయడంలో విజయం సాధించారు. దీంతో ఆయన ఉన్నతాధికారులతో పాటు సామాన్య జనం నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆయనకు కరోనా సోకినట్లు శుక్రవారం నిర్ధారణ కావడంతో అనేక మంది ఆవేదనకు గురయ్యారు. దీనిపై బొమ్మనహళ్లి ఎమ్మెల్యే సతీష్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ నాగేంద్ర కుటుంబానికి అన్యాయం జరిగిందని వాపోయారు. నాగేంద్ర బావ కూడా ప్రభుత్వ వైద్యుడిగా, కరోనా మహమ్మారి బారిన పడిన అనేక మంది ప్రాణాలను కాపాడారని శ్లాఘించారు. చివరకు ఆయనే కరోనాకు బలి కావడం…విధి ఆడే వింత నాటకమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos