హోసూరు : టొమాటో ధరలు పెరగడంతో హోసూరు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. హోసూరు ప్రాంతంలో టొమాటో, బీన్స్, బంగాళాదుంప, బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్ తదితర వాణిజ్య పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలను తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి తదితర జిల్లాలకే కాకుండా కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా కరోనా ప్రభావంతో తమిళనాడులో నే కాకుండా ఇతర రాష్ట్రాలలో మార్కెట్లను మూసేయడంతో హోసూరు ప్రాంతంలో పండించిన పంటలు అమ్ముడుపోక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరలు పడిపోవడంతో హోసూరు ప్రాంతంలో పండించిన టొమాటోలను రైతులు తోటల్లోనే వదిలివేశారు. గత కొద్దిరోజులుగా రవాణా సౌకర్యం మెరుగు పడడంతో రైతులు కూరగాయలను ఇతర రాష్ట్రాలకు తరలించడంతో టొమాటో ధరలకు రెక్కలొచ్చాయి. హోసూరు బత్తలపల్లి మార్కెట్లో 22 కిలోల టొమాటో ధర రూ.950కి ఎగబాకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడడంతో హోసూరు నుండి కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు టొమాటోలను రవాణా చేస్తుండడంతో ధరలు పెరిగాయని రైతులు తెలిపారు.