హొసూరు : తమిళనాడులోని అన్ని విద్యా సంస్థలు, మద్యం దుకాణాలు, థియేటర్లు, మాల్స్, రిసార్టులను ఈ నెల 31 వరకు మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి ప్రకటించారు. కరోనా భీతి నేపథ్యంలో సోమవారం ఆయన తన మంత్రివర్గ సహచరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అమ్యూజ్‌మెంట్ పార్కులు, మ్యూజియంలు, స్విమ్మింగ్‌పూల్స్, జిమ్నాజియంలను సైతం మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కిండర్‌గార్టెన్, ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది. వివాహాది శుభకార్యాలపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులను ఈ నెలాఖరు వరకు నిషేధించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక్క కరోనా పాజిటవ్ కేసు నమోదైంది. కాంచీపురానికి చెందిన 45 ఏళ్ల ఇంజనీరు కరోనా బారిన పడగా, అతనికి పూర్తి స్వస్థత చేకూరడంతో నేడో రేపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు.