హోసూరు : కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సమీపంలోని వర్తూరు చెరువు నీటిని కేసీ వ్యాలీ వాటర్ ప్రాజెక్ట్ పేరుతో ఎత్తిపోతల పథకానికి మళ్లించడంతో తమిళనాడులోని దక్షిణ పెన్నానది పరీవాహక ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లాలోని నంది కొండల్లో పుట్టే పెన్నా నది గౌరిబిదనూరు వద్ద రెండు పాయలుగా చీలి ఒక పాయ ఆంద్రప్రదేశ్‌లోకి, మరో పాయ చిన్న తిరుపతి సమీపంలోని తత్తనూరు వద్ద తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. నంది కొండల్లో పడే వర్షం వల్ల దక్షిణ పెన్నా నీరు తమిళనాడుకు చేరేది. బెంగళూరులో వరద నీరు వర్తూరు, బెళ్లందూరు చెరువుల మీదుగా దక్షిణ పెన్నా నదికి చేరడంతో ఈ నది జీవ నదిగా మారింది. తమిళనాడులో దక్షిణ పెన్నా నదిపై హోసూరు సమీపంలో కెలవరపల్లి డ్యాం, కృష్ణగిరి వద్ద కె ఆర్ పి డ్యాం, సాతనూరు డ్యాంలకు దక్షిణ పెన్నానది నీరు చేరి కడలూరు వద్ద సముద్రంలో కలసిపోతుంది. దక్షిణ పెన్నా పరీవాహక ప్రాంతమైన కృష్ణగిరి, ధర్మపురి, తిరువన్నామలై, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. హోసూరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు సైతం దక్షిణ పెన్నానది నీటిని శుద్ధీకరణ చేసి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం బెళ్లందూరు, వర్తూరు చెరువుల నీటిని కోలారు జిల్లాలోని చెరువులకు ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లిస్తోంది. కోరమంగల- చల్లఘట్ట వ్యాలీ (కేసీ వ్యాలీ) వాటర్ ప్రాజెక్టుకు రూ.1,400 కోట్ల నిధులు విడుదల చేసి, భారీ పైపులైన్లను ఏర్పాటు చేశారు. వర్తూరు సమీపంలోని సిద్ధాపురం వద్ద భారీ యంత్రాల ద్వారా కోలారు జిల్లాలోని చెరువులను నింపుతున్నారు. దీనివల్ల దక్షిణ పెన్నానది ద్వారా తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నీరు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఎల్లప్పుడూ వ్యర్థ జలాలతో కళకళలాడే వర్తూరు చెరువు కూడా ఎడారిగా మారింది. కర్ణాటక ప్రభుత్వం కేసీ వ్యాలీ ప్రాజెక్టును ప్రారంభిస్తుందని తెలియడంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం ఏడాది కిందట సుప్రీంకోర్టులో కేసు వేసి, ప్రాజెక్టును నిలిపివేయాలని కోరింది. కేంద్ర జల సంఘం ద్వారాఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో వివాదాన్నిపరిష్కరిస్తామని కేంద్ర జల సంఘం తమిళనాడు ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కేసీ వ్యాలీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంతో వర్తూరు చెరువు నుండి దక్షిణ పెన్నానది ద్వారా తమిళనాడుకు వచ్చే నీరు పూర్తిగా తగ్గిపోయింది. ఏటా వర్షా కాలంలో దక్షిణ పెన్నా నది ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీరు తమిళనాడులోని డ్యాములకు చేరేది. ప్రస్తుతం వర్షా కాలమైనా కేవలం 140 క్యూసెక్కుల నీరు మాత్రమే తమిళనాడుకులోని కెలవరపల్లి డ్యాంకు చేరుతోంది. కేసీ వ్యాలీ ప్రాజెక్టు కారణంగానే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిందని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎండాకాలంలో తమిళనాడులోని పెన్నా డ్యాంలలో చుక్క నీరుకూడా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసీ వ్యాలీ వాటర్ ప్రాజెక్టు వల్ల తమిళనాడు రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల సాగు భూమి ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడినా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వేల ఎకరాల పంట భూములు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడే పరిస్థితి దాపురించినా, పాలక పక్ష నాయకులు 2021లో జరిగే శాసన సభఎన్నికలకు సన్నాహాలు చేసుకొంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే వ్యవసాయంలో నష్టాలు పాలవుతున్న హోసూరు ప్రాంత రైతులకు దక్షిణ పెన్నా నీరు అందకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిన్నగుట్టప్ప
ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హోసూరు సమీపంలోని కొడియాలం చెక్ డ్యాం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా బాగలూరు నుండి బేరికే వరకు గల చెరువులను నింపేందుకు సర్వే పనులు మొదలు పెట్టారు. దక్షిణ పెన్నా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో కొడియాలం ఎత్తిపోతల పథకం ఆశయం నెరవేరే సూచనలు కనిపించడంలేదని చిన్నగుట్టప్ప తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ ఉపద్రవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కర్ణాటక రాష్ట్రం ప్రారంభించిన కేసీ వ్యాలీ ప్రాజెక్టుకు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు.