ఫిర్యాదు చేయడానికి వెళితే బంజారహిల్స్ పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వీడియో పోస్ట్ చేసిన విజయవాడకు చెందిన అట్లూరి సురేష్ దంపతులు తాజాగా మరో వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.వాళ్లు చేసిన మోసాలు అన్ని బయటపడటంతో తప్పు చేసినట్లు ఒప్పుకున్నారని అంజనీకుమార్ పేర్కొన్నారు.వీడియోలో దంపతులు ఏం మాట్లాడారంటే..తమ ఆరోపణల్లో నిజం లేదని, మతిస్థిమితం కోల్పోయి అలా మాట్లాడామంటూ ఆ వీడియోలో అట్లూరి సురేష్ దంపతులు తెలిపారు. తాము ఇష్టం వచ్చినట్లు మాట్లాడామని, మీడియా సమయాన్ని వృథా చేశామని, తమను క్షమించాలని చెప్పారు. బంజారాహిల్స్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశామని, ఈ విషయంపై తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.కాగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో నివసిస్తోన్న అట్లూరి సురేష్, ప్రవిజ దంపతులు తాము ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేగాక, తమను అక్కడ నిర్బంధించి లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన విషయం తెలిసిందే..