బెంగళూర్ : కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాల నుంచి ముస్లిం, క్రైస్తవ మతాలు, సంబంధిత పాలకుల అధ్యాయాల్ని తొలగించటం వివాదాస్పదంగా మారింది. కరోనా కారణంగా పాఠ్యాంశాల్ని ముప్పయి శాతం వరకూ తగ్గించారు. ఇందులో మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, మొఘల్, రాజ్పుత్ల చరిత్రకు సంబంధించిన అధ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ సాధారణ విద్యా సంవత్సరం పని దినాలు 210-220. ఈ ఏడాది పని దినాలు 120-140 మాత్రమే. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి పాఠ్యాంశాల్ని కుదించే దిశలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అధ్యాయాల్ని ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.