హైదరాబాద్: సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో గడిపే సహనం… మైదానంలో నలుదిశలా చక్కటి స్ట్రోక్స్ ఆడగల సత్తా… ఫార్మాట్‌ను బట్టి ఆటతీరు మార్చుకోగల నైపుణ్యం… చిన్న వయసు నుంచే నిలకడగా భారీ స్కోర్లు సాధించగల ప్రతిభ… ఇవన్నీ 16 ఏళ్ల తిలక్ వర్మను ప్రత్యేకంగా నిలబెడతాయి. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగల సత్తా ఉన్న ఆటగాడిగా క్రికెట్ వర్గాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకోవడం అతని బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన తిలక్ ఇప్పటికే ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. దాదాపు మూడేళ్ల క్రితం దేశవాళీ అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో భారీగా పరుగులు సాధించడంతో అందరి దృష్టి అతనిపై పడింది. ఆ టోర్నీలో ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 5 సెంచరీలు (ఇందులో ఒక డబుల్ సెంచరీ), 2 అర్ధసెంచరీలతో ఏకంగా 960 పరుగులు సాధించడం విశేషం. అప్పటి నుంచి అతని కెరీర్ వేగంగా దూసుకుపోతోంది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచినందుకు తిలక్ వర్మకు బీసీసీఐ వార్షిక అవార్డుల్లో దాల్మియా పురస్కారం లభించింది.