బెంగళూరు : నగరంలోని చామరాజపేటలో గల న్యూతరగుపేటలో గురువారం మధ్యాహ్నం సంభవించిన విస్ఫోటనానికి ఇద్దరు బలయ్యారు. పేలుడు తీవ్రతకు మృత దేహాలూ కనీసం మూడు మీటర్ల ఆవల పడ్డాయి. మృతుల చేతులు, కాళ్లు తదితర శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. పేలుడు శబ్దం వంద మీటర్ల వరకు వినిపించిందని, పేలుడు తీవ్రతకు భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. పేలుడు స్థలానికి సమీపంలోని పది బైక్‌లు దాకా ధ్వంసమయ్యాయి. తొలుత సిలిండర్ పేలిందని, ఆనక కంప్రెసర్ విస్ఫోటనమని కథనాలు వినిపించినా…దానికి ఆధారాలు కనిపించలేదని బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ హరీశ్ పాండే తెలిపారు. ఓ గోదాములో టపాసులు నిల్వ ఉంచారని, పేలుడుకు అవే కారణమై ఉండవచ్చని వినిపించినా, దానికీ తగిన ఆధారాలు లభించలేదని చెప్పారు. మొత్తానికి ఇదేదో విస్ఫోటనంలా పైకి కనిపిస్తోందని, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని ఘటనా స్థలికి రప్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా ఓ వాహనంలో 80 బాక్సుల టపాసులను గోదాములోకి తరలిస్తుండగా, మూడు పెట్టెలు పేలాయని సమాచారం. అన్ని పెట్టెలూ పేలి ఉంటే, భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గోదాము యజమాని బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీవీ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.