తాళిబొట్లు వెనక్కి ఇచ్చేసిన దొంగలు

తాళిబొట్లు వెనక్కి ఇచ్చేసిన దొంగలు

హిందూపురం : భోజనం చేస్తున్న సమయంలో ఓ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు మెడపై కత్తిపెట్టి, తుపాకీతో బెదిరించారు. అందినకాడికి బంగారు నగలను దోచుకున్నారు. సుమారుగా 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. కానీ వెళ్లేటప్పుడు మాత్రం ఇద్దరి మహిళల తాళిబొట్లు వెనక్కి ఇచ్చారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర పంచాయతీ పరిధిలో గల వెంకటాద్రి లేఅవుట్​లో నివాసమున్న నిత్యానంద రెడ్డి ఇంటిలో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. బాధితులు నిత్యానంద రెడ్డి, అతని భార్య శ్యామల తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటిలో భోజనం చేస్తుండగా కారులో ఐదుగురు దుండగులు వచ్చారు. అందులో ఒకరు కారులోనే ఉన్నారు. మరో నలుగురు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే మెడపై కత్తి పెట్టి తుపాకి చూపించి మెడలో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. అనంతరం నిత్యానంద రెడ్డి చేతులను కట్టేసి పూజ గదిలో వేసి తాళం వేశారు. అతని భార్య శ్యామలను మరో గదిలో బంధించారు. అక్కడే వారి తల్లిదండ్రులు నరసారెడ్డి, లక్ష్మీ దేవమ్మ, చిన్న పిల్లలు ఉండగా వారిని గదిలో కూర్చొమని చెప్పారు. బీరువాలో ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అయితే వెళ్తూ ఈ విషయం పోలీసులకు చెప్తే మళ్లీ రేపు వచ్చి మీ కుమారుడిని చంపేస్తామని హెచ్చరించి వెళ్లారు. వారు వెళ్లిపోయిన కొద్దిసేపటికి పూజ గదికి వేసిన తాళం పగలగొట్టడంతో నిత్యానంద రెడ్డి బయటికి వచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే డీఎస్పీ మహేష్, అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని తనిఖీ చేశారు. ఘటన జరిగిన సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్​ను పరిశీలించారు. అయితే వచ్చిన వారందరూ హిందీలో మాట్లాడారని, అంతేగాక వారిలో ఒకరిద్దరు తాము వచ్చింది ఎవరినో చంపడానికి అని, ఎమ్మెల్యే కుమారుడు తప్పుడు సమాచారం ఇచ్చాడంటూ వారిలో వారు తిట్టుకున్నట్లు బాధితుడు నిత్యానంద రెడ్డి పోలీసులకు తెలిపాడు.సుమారు 12 తులాల బంగారం నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేసాక  ఇద్దరు మహిళల తాళిబొట్లు వెనక్కి ఇచ్చి వెళ్లారని  బాధితులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos