ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ

ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ

తూత్తుకుడి: నగరంలో ఓ ఇంటిని దోచేసిన దొంగ దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ ఓ లేఖ రాసి పెట్టి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్, ఆయన భార్య ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం కావడంతో వారంతా వేరే ఊళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 17న భార్యాభర్తలిద్దరూ చెన్నైలోని ఓ కుమార్తెను చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటిని చూసుకునేందుకు సెల్వి అనే మహిళను నియమించుకున్నారు. సోమవారం సాయంత్రం సెల్వి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా తలుపులు తెరిచి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె వెంటనే యజమానికి తెలియజేసింది. దీంతో హుటాహుటిన చిత్తిరై సెల్వన్ చెన్నై నుంచి వచ్చి చూడగా.. బీరువాలో ఉన్న రూ.60 వేల నగదు, బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఓ లెటర్ దొరికింది. అది దొంగ రాసిన ఉత్తరంగా పోలీసులు గుర్తించారు. అందులో ‘నన్ను క్షమించండి. నెలలో వీటిని తిరిగి ఇచ్చేస్తాను. మా ఇంట్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది. అందుకే దొంగతనం చేశాను’ అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన పోలీసులు, ఇంటి యజమాని, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos