అప్పుడు చక్రం తిప్పారు..ఇప్పుడు చతికిలపడ్డారు..

అప్పుడు చక్రం తిప్పారు..ఇప్పుడు చతికిలపడ్డారు..

ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయనే సామెత అన్ని రంగాలపై రాజకీయ రంగానికి చక్కగా అతుకుతుందనే సామెత మరోసారి నిరూపితమైంది.తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిని ఇద్దరు నేతల ప్రస్తుతం కార్యకర్తల కంటే ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.ఆ ఇద్దరు నేతలు మరెవరో కాదు ఒకరు జూపల్లి కృష్ణారావు మరొకరు కడియం శ్రీహరి.మొదట జూపల్లి కృష్ణారావు గురించి మాట్లాడుకుంటే..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెరాస అధికారంలోకి రాగానే కేసీఆర్‌ మంత్రివర్గంలో మంత్రి స్థానం దక్కించుకున్నారు.అప్పటికే బలమైన నేతగా పేరున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా పదవి దక్కాక మరింత అధిపత్యం చెలాయించసాగారు.రోజురోజుకు జూపల్లి అధిపత్య ధోరణి మితిమీరడంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు జూపల్లికి దూరమయ్యారు.ఈ క్రమంలో గత ఏడాది డిశంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని నియోజవకర్గాల్లో తెరాస విజయపతాకం ఎగురవేయగా జూపల్లి కృష్ణారావు పోటీ చేసిన కొల్లాపూర్‌లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందారు.జూపల్లి తీరుపై విసుగు చెందిన కార్యకర్తలు ఎన్నికల్లో జూపల్లిని ఓడించడానికి కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డికి సహకరించారనే వార్తలు వినిపించాయి.ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయిన జూపల్లి తెరాస పార్టీలో కూడా పరపతిని కోల్పోయారు.అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో జూపల్లిని ఓడించిన హర్షవర్ధన్ రెడ్డి, గులాబీ గూటికి చేరగా జిల్లాలోని మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హర్షవర్ధన్‌ వైపే ఉన్నారు.మొన్నటి పరిషత్ న్నికల్లోనూ హర్షవర్ధన్ రెడ్డే మొత్తం చూసుకున్నారట. టీఆర్ఎస్ అధిష్టానం కూడా హర్షవర్ధన్‌కే మద్దతు తెలపడంతో గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన జూపల్లి… ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒంటరిగా మిగిలిపోయారట. చివరకు నియోజకవర్గంలోని అధికారులుగానీ, పోలీసులుగానీ… ఇప్పుడు జూపల్లి మాటే వినడం లేదని  ఏమాత్రం లెక్కచేయక పోవడంతో మౌనంగా ఉన్నారట.ఇక రెండవ నేత కడియం శ్రీహరి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన కడియానికి చంద్రశేఖర్ రావు రెండో మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కేవలం ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. చంద్రశేఖర్ రావుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన .. ప్రస్తుతం వ్యూహాత్మక మౌనవ్రతం పాటిస్తున్నారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలకు దిగడం ద్వారా…తనకు తానే దెబ్బతీసుకున్నారు.మహిళను వేధించాడంటూ రాజయ్యకు సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి బయటకు రావడంతో రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దంటూ కేసీఆర్‌ను ఒత్తిడి చేసినా లెక్క చేయని కేసీఆర్‌ రాజయ్యకే టికెట్‌ ఇవ్వడంతో కడియం శ్రీహరి నొచ్చుకున్నారట.రెండవది అటు శాసనసభ ఎన్నికల్లో ఇటు లోక్‌సభ ఎన్నికల్లో తన కుమార్తె కావ్యకు టికెట్‌ ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. అయినప్పటికీ కడియం సర్దుకుపోయారు.అన్నిటికంటే ముఖ్యంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తనకు సమకాలీకుడైన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని మాత్రం కడియం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్నీ తానై నడిపిన నేత.. ఇఫ్పుడు సాదాసీదాగా మారారు. పార్టీలో, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రాధాన్యం తగ్గింది.దీంతో కొద్ది కాలంగా మౌనంగా ఉంటూ పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉంటున్న కడియం శ్రీహరి తాజాగా బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.తెరాసలో తనకు ఎదురైన చేదు అనుభవాలతో తెరాస అధినేతపై గుర్రుగా ఉన్న కడియం శ్రీహరి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos