ఇప్పుడంటే స్మార్ట్ మొబైళ్ల కాలం నడుస్తోంది కానీ ఓ 20 ఏళ్ల క్రితం మొబైళ్ల శకం మొదలైన రోజుల్లో నోకియా మొబైళ్ళు ఒక వెలుగు వెలిగాయి.ఎవరి చేతిలో చూసినా ముఖ్యంగా 3310 ,1100 ,1108 మోడల్ మొబైళ్ళు కనిపించేవి.అప్పటి యువతకు నోకియా 3310’ ఫోన్ ఓ మధుర జ్ఞాపకమే అయి ఉంటుంది. అప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఫోన్‌ను చాలామంది వాడి ఉంటారు. మందిలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు.. స్టైల్‌గా ఫోన్ ఎత్తి మాట్లాడదామని అనుకునే ఉంటారు. స్నేక్ గేమ్ ఆడుతూ సరదాగా గడిపి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా? మనకు ఆనందాన్ని పంచిన మొదటి ఫీచర్ ఫోన్‘నోకియా 3310’ మార్కెట్లో లాంచ్ అయి నేటికి సరిగ్గా 20 ఏళ్లు అయిందట. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ ఫోన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ ఫోన్‌ను ఫిన్లాండ్కు చెందిన నోకియా కంపెనీ తయారుచేసింది. తెలుపు కీప్యాడ్, లేత నీలం రంగు బాడీతో దృఢంగా ఉండేది. బ్యాటరీ బ్యాకప్‌లో దీనికిదే సాటి. అప్పుడున్న ట్రెండింగ్ ఫోన్ కాబట్టి అందరూ దీన్ని వాడారు. అందుకే ఈ రోజు దీనితో ఉన్న అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. క్లాసిక్ రింగ్‌టోన్ జింగిల్ నుంచి ప్రసిద్ధ ‘స్నేక్’ ఫోన్ గేమ్ వరకు ఇందులోని అన్ని ఫీచర్స్‌ను వారు గుర్తుచేసుకున్నారు.