తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల వలసలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మినహా ఎవరుకూడా మిగిలేట్లుగా కనిపించడం లేదు.ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కారెక్కడానికి సిద్ధమవడంతో విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది.ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు కూడా తమదారులు చూసుకుంటుండడంతో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ కషాయం పార్టీలో చేరి కాంగ్రెస్‌కు అతిపెద్ద షాక్ ఇచ్చారు.కాంగ్రెస్‌కు పూర్వవైభం తీసుకువస్తామని కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెబుతున్నా నేతలు మాత్రం ఇతర పార్టీల్లోకి వలసలు వెళుతుండడంతో ఏంచేయాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.తాజాగా మంగళవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో డీకు అరుణ బీజేపీలో చేరడంతో తెలంగాణలో మరో కీలకనేతను కోల్పోయింది.బీజేపీలో చేరిన అనంతరం అరుణ మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు పూర్తగా కనుమరుగయ్యాయన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు,ఆకాంక్షలు నెరవేర్చడం కేవలం ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని విశ్వసించే బీజేపీలో చేరామన్నారు.కాగా డీకే అరుణ చేరిక వెనుక చాలా తతంగం జరిగినట్లు తెలుస్తోంది.శాసనసభ ఎన్నికల్లో గద్వాలలో పరాజయం పొందిన డీకే అరుణను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో అసహనంతో ఉన్నట్లు సమాచారం.టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించగా అందుకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారని సమాచారం.ఈ క్రమంలో మంగళవారం బీజేపీ నేత రాంమాధవ్ నివాసంలో గంటపాటు మంతనాలు జరిపిన అరుణతో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి డీకే అరుణకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో డీకే అరుణ బీజేపీలో చేరినట్లు సమాచారం.మరికొంత మంది కాంగ్రెస్ నేతలు తెరాస, బీజేపీల వైపు చూస్తున్నారని సమాచారం.మొన్న చేవెళ్ల చెల్లెమ్మ తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించగా నిన్న గద్వాల చెల్లెమ్మ బీజేపీలో చేరడం విశేషం..